|
| ఉగ్రవాదం చుట్టూ తిరిగే సత్యమేవ జయతే |
| శనివారం, 14 ఫిబ్రవరి 2009 ( 15:31 IST ) | |
పోలీసు పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ మరోమారు అదే తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం సత్యమేవ జయతే. అమితాబ్ హీరోగా చాలారోజుల క్రితం వచ్చిన ఖాకీ చిత్రం ఈ చిత్రానికి మాతృక అయినా చాలా సీన్లలో ప్రస్తుత పరిస్థితులను జోడించి తీయడం విశేషం.
ఇక ఈ చిత్రానికి సంబంధించి విశేషాలు చెప్పాలంటే ఈ చిత్రానికి రాజశేఖర్ సతీమణి జీవిత దర్శకత్వం వహించడం, రాజశేఖర్ సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మించడం, చాలాకాలం తర్వాత రాజశేఖర్ పాత్రకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం, కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎం. సత్యనారాయణ ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్ర పోషించడం.
రాజకీయనాయకులు, పోలీసులు పోషించడం వల్లే ఉగ్రవాదం పేట్రేగిపోతోందని వారు నిజాయితీగా ఉంటే ఉగ్రవాదం ఊసే ఉండదని చెప్పడమే ఈ చిత్రంలోని పాయింట్.
నటీనటులు: రాజశేఖర్, సంజన, మిలింద్ సోమన్, నీతూచంద్ర, షెరిల్ షింటో, శివాజీ, సాయికిరణ్, మంత్రి ఎం. సత్యనారాయణ, బ్రహ్మానందం, అలీ, ఆహుతీప్రసాద్, వైజాగ్ ప్రసాద్, అన్నపూర్ణ తదితరులు.
సాంకేతిక వర్గం: నిర్మాతలు- శివానీ, శివాత్మిక, బేనర్- శివాత్మిక మూవీస్, కథ, స్క్రీన్‌ప్లే, రాజశేఖర్, దర్శకత్వం- జీవిత రాజశేఖర్.
కథ: రాష్ట్రంలో పలుచోట్ల బాంబుపేలుళ్లు జరుగుతుంటాయి. జనసంచారం ఉన్న ప్రదేశాల్లో ఈ బాంబు పేలుళ్లు జరగడంతో పెద్ద ఎత్తున ప్రజలు చనిపోతుంటారు. ఈ పేలుళ్ల నేపథ్యంలో దీనికి కారణంగా అనుమానిస్తున్న డాక్టర్ ఇక్బాల్ అన్సారీ అనే వ్యక్తి పోలీసులకు చిక్కుతాడు. వైజాగ్‌లో పోలీసుల చేతికి చిక్కిన అన్సారీని, ఇతర తీవ్రవాదులను హైదరాబాద్‌కు తరిలించే బాధ్యతను నిజాయితీగల పోలీస్ ఆఫీసర్‌గా పేరుఉన్న సత్య (రాజశేఖర్)కు అధికారులు అప్పగిస్తారు.
ఇక సత్య కేరెక్టర్ గురించి చెప్పాలంటే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయిన సత్య దేశద్రోహుల్ని కాల్చి చంపడమే కరెక్ట్ అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంటాడు. సత్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి (మంత్రి ఎం. సత్యనారాయణ) అండదండలు ఉంటాయి. సత్య డ్యూటీలో ఎంత నిజాయితీ అంటే ఒకానొక పరిస్థితిలో తప్పుచేసింది తోటి ఆఫీసర్ అని తెలిసి అతన్నే కాల్చేస్తాడు. దీంతో మనస్థితి సరిగాలేదంటూ కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో గడుపుతాడు సత్య.
ఆస్పత్రినుంచి తిరిగిరాగానే వైజాగ్‌లో ఉన్న టెర్రరిస్టులను హైదరాబాద్‌కు తీసుకువచ్చే పనిని సత్యకు అప్పగించడం జరుగుతుంది. ఈ ఆపరేషన్‌లో సత్యకు సహకరించేందుకై పోలీసు ఉద్యోగులైన బాసరపాప (నీతూచంద్ర), శివాజీ, సాయికిరణ్, శివారెడ్డిలు బయలుదేరుతారు. అయితే టెర్రరిస్టులను తీసుకువచ్చే క్రమంలో సత్య గ్రూపుకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. దీంతో వాటినుంచి బయటపడుతూనే అందుకు కారణమైన వారు రాజకీయనాయకులు, పోలీసులేనని సత్య గ్రహిస్తాడు.
అలాగే తను తీసుకువస్తున్న తీవ్రవాది అన్సారీకి సైతం ముప్పు ఉందని తెల్సుకుని సత్య తన ఫ్లాన్ మారుస్తాడు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలకోర్చి హైదరాబాద్‌కు చేరుకునేలోగా సత్య గ్రూప్‌లోని ఇద్దరు పోలీసులు మరణిస్తారు. అలాగే హైదరాబాద్ చేరుకున్న తర్వాత అన్సారీ కొన్ని నిజాలను సత్యకు చెబుతాడు. ఇంతకీ అన్సారీ సత్యకు ఏం చేప్పాడు. అటుపై సత్య ఏం చేశాడు. చివరకు కథకు ఎలాంటి ముగింపు లభించిందన్నదే మిగతా చిత్రం
విశ్లేషణ: రాజశేఖర్ నటన అద్భుతంగా ఉన్నా ఆ పాత్రకు సాయికుమార్ డబ్బింగ్ పవర్ మాత్రం ఈ చిత్రంలో కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. రాజశేఖర్‌కు తోడుగా నటించిన మిగిలినవారి పాత్రలు సైతం బాగానే ఉన్నాయి. బ్రహ్మానందం ఒకే సీన్‌లో వచ్చిపోయినా, బాంబ్ స్క్వాడ్ ఆఫీసర్‌గా అలీలు కామెడీకి తమవంతు సాయం చేశారు.
ఈ చిత్రంలో హోం మంత్రిగా షిండే పాత్ర కీలకంగా ఉంటుంది. షిండే పాత్ర ద్వారా నేటి రాజకీయ నేతల మనోభావాలను తెరమీద చూపించే ప్రయత్నం చేశారు. ఇక మథర్‌థెరిస్సా ఫోటో పెట్టుకుని ఛారిటబుల్ ట్రస్టు నడిపే వ్యక్తి ఓ పిల్లాడ్ని కొడుతుంటే రాజశేఖర్ వెళ్లి అతన్ని తప్పించి మథర్ ఫోటో పెట్టుకుంటే సరిపోదు ఆమె లక్షణాలు కూడా కొంచెం నేర్చుకోవాలని చెప్పే మాటలు ఎవరినో ఉద్ధేశించి చెప్పినవిగా అన్పిస్తాయి.
అలాగే ముస్లీంలంతా టెర్రరిస్టులు కాదని, వారిలోనూ దేశభక్తి ఉందని క్లైమాక్స్‌లో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలోని దృశ్యాలు చాలావరకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దారన్నది స్పష్టం. ఇక ఈ చిత్రానికి సంబంధించి సంగీతం సమకూర్చిన నాని గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఈ సీరియస్ తరహా చిత్రానికి పాటలు అతుకుల్లా అనిపిస్తాయి.
మొత్తం మీద ఈ సత్యమేవ జయతే చిత్రం ద్వారా తనేమిటో చెప్పాలనే రాజశేఖర్ తపనతోపాటు టైటిల్స్‌లో తన పేరుముందు మహాస్టార్ అని వేసుకోవడంతో తన పవర్ కూడా తెలియజేయాలనే ఆయన ఉత్సాహం కూడా స్పష్టంగా కన్పిస్తుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|