|
| శ్రీనువైట్ల మరో మైండ్‌గేమ్ కింగ్ |
యువసామ్రాట్ నాగార్జున "కింగ్" రూపంలో ఈ ఏడాది మరో అగ్రహీరో చిత్రం ప్రేక్షకులను పలకరించింది. ఈ ఏడాది అగ్రహీరోల చిత్రాలు చాలా తక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే. ఏడాది చివర్లో వచ్చిన నాగార్జున "కింగ్" మైండ్‌గేమ్‌తో రూపొందింది. 'ఢీ', 'రెడీ' వంటి చిత్రాలను మైండ్‌గేమ్‌తో ఎంటర్‌టైనర్‌లుగా ఎలా తీయవచ్చో చేసి చూపించిన శ్రీనువైట్ల, 'కింగ్'లోనూ ఇదే ప్రయత్నం చేశారు. మొదటి నుంచి నాగార్జున చెబుతున్నట్లు 'హలోబ్రదర్', 'ఢీ' కలిస్తే ఎలా ఉంటాయో 'కింగ్' కూడా అలాగే ఉంటుంది.
అక్కినేని నాగార్జున, త్రిష, మమతామోహన్‌దాస్, బ్రహ్మానందం, సూర్య, శ్రీహరి, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, కృష్ణభగవాన్, గీత, చంద్రమోహన్, ధర్మవరపు తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: దేవీశ్రీప్రసాద్, నిర్మాత: శివప్రసాద్‌రెడ్డి, బేనర్: కామాక్షి కళా మూవీస్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్ల. కింగ్ (రాజవంశీయుడు), బొట్టుశ్రీను (రౌడీ), శరత్ (కంప్యూటర్ సాఫ్ట్‌వేర్) పాత్రల్లో నాగ్ కనిపిస్తారు. ఈ మూడు పాత్రలు చూసేకొద్ది ప్రేక్షకులను కాస్త గందరగోళానికి గురిచేస్తాయి.
కథ: ఓ ప్యాలెస్ వేలంపాటలో ప్రత్యర్థి విలన్‌ను రెచ్చగొట్టి, 50లక్షలు విలువచేసే భవనాన్ని రెండు కోట్లకు ప్రత్యర్థిని కొనేలా చేస్తాడు కింగ్. దీంతో "కింగ్" ఎలాంటివాడో తొలిషాట్‌లోనే దర్శకుడు చూపిస్తాడు. చంద్రప్రతాపవర్మ (నాగార్జున)ను అందరూ "కింగ్' అని పిలుస్తుంటారు. ఆ వంశోద్ధారకుడు ఈయనే. "కింగ్" తల్లిదండ్రులు రాజావర్మ (శోభన్‌బాబు), తల్లి గీత. ఇతనికోక తమ్ముడు ఉంటాడు. అతని పేరు దీపక్. తండ్రి మరణంతో కింగ్ ఆ ఆస్తికి వారసుడవుతాడు. మరోవైపు కింగ్ మామయ్యలు ముగ్గురు ఆస్తి కాజేయాలని ప్రయత్నిస్తుంటారు.
ఆస్తిని దోచుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా విఫలమవడంతో.. వారు డబ్బులను రేసులు, పేకాటలకు హారతి కర్పూరం చేస్తుంటారు. ఆఖరికి ఇంట్లో దొంగతనం చేసి దాన్ని మేనేజర్‌పై పెట్టి ఇంటి నుంచి అతడిని వెళ్లగొడతారు. ఇది తెలిసిన కింగ్ వారిని నిలదీస్తాడు. ఇక తమకు అడ్డుపడుతున్న కింగ్‌ను ఎలాగోలా వదిలించుకోవాలని మేనమామలైన కృష్ణభగవాన్, షిండే, జయప్రకాష్ రెడ్డి అవకాశం కోసం వేచి చూస్తుంటారు.
ఓ రోజు వ్యాపార నిమిత్తం ఉత్తరాంచల్‌కు కింగ్ ఒక్కడే వెళ్లాల్సివస్తుంది. ఇదే సరైన సమయమని మేనమామలు ముగ్గురు ఏదో ప్లాన్ చేస్తున్నట్లు కనబడతారు. తీరా అక్కడికి వెళ్ళగానే కింగ్‌ను మమతామోహన్‌దాస్ రిసీవ్ చేసుకుంటుంది. వీరిద్దరూ మాట్లాడుతుండగానే ఓ ముసుగు వ్యక్తి కింగ్‌ను కాల్చేస్తాడు. అయితే గురితప్పుతుంది. అతడిని కింగ్ పట్టుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఆయన వెనుక ఉన్న మమతా కింగ్‌ను కాల్చేస్తుంది. కింగ్ చనిపోతాడు.
ఇక.. ఇంటి దగ్గర కింగ్ తల్లితో తన మేనల్లుడు కన్పించడం లేదని హడావుడి చేస్తారు. దీంతో ఆమె దేశమంతా వెతికించే ప్రయత్నం చేస్తుంది. కట్‌చేస్తే... హైదరాబాద్‌లో బొట్టుశ్రీను అనే రౌడీ (నాగార్జున), జ్ఞానేశ్వర్ (శ్రీహరి) అనే ఇద్దరు రౌడీలుంటారు. వీరిద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ వాటా పంపంకంతో ఒకటవుతారు. జ్ఞానేశ్వర్ చెల్లెలు శ్రావణి (త్రిష) ఓ ఔత్సాహిక గాయని. ఓ టీవీ ఛానెల్ పెట్టిన సంగీత కార్యక్రమంలో పాల్గొంటుంది. దానికి జడ్జిగా గొప్ప సంగీత దర్శకుడు జయసూర్య (బ్రహ్మానందం) హాజరవుతాడు.
అతడు.. గమనాలు, శృతి, లయలు తెలీకుండా కాపీకొట్టి సంగీతదర్శకుడిగా పేరుతెచ్చుకున్న రకం. గాయని బాగుంటే రాత్రికి బుక్‌చేసుకునే రకం. దీంతో శ్రావణి బాగా పాడినా ఇదేం... సంగీతమంటూ... నిరుత్సాహపరుస్తుంటాడు. ఇది గమనించిన బొట్టుశ్రీను... జయసూర్యకు వార్నింగ్ ఇచ్చి శ్రావణికి మొదటిప్రైజ్ వచ్చేలా చేస్తాడు. జయసూర్య దీన్ని మనసులో పెట్టుకుని బొట్టుశ్రీనుపై పగపెంచుకుంటాడు.
మరోవైపు తాను రౌడీనని తెలిస్తే... శ్రావణి ప్రేమించదని.. అప్పటికే ఆమెకోసం వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శరత్ ప్లేస్‌లో బొట్టుశ్రీను వచ్చి తానే శరత్ అంటాడు. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పాకానపడుతుంది. ఇక ఇద్దరూపెండ్లిచేసుకుందామని నిర్ణయించుకుంటారు. తర్వాత తన అన్న జ్ఞానేశ్వర్ (శ్రీహరి) వద్ద బొట్టుశ్రీనును.. ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ వ్యాపారం చేసే వ్యక్తిగా శ్రావణి పరిచయం చేస్తుంది. దీంతో కన్‌ఫ్యూజ్ అయిన జ్ఞానేశ్వర్.. ఆ తర్వాత తన రీసెర్చ్‌లో బొట్టుశ్రీను, శరత్ వేరువేరు అనే నిర్ధారణకు వస్తాడు.
లైన్‌క్లియర్ అయి పెండ్లిపీఠలదాకా వచ్చే టైమ్‌లో... కొంతమంది గూండాలు బొట్టుశ్రీను, ఉరఫ్ శరత్‌లను కింగ్ అనుకుని వెంటాడుతారు. ఆ క్రమంలో జయప్రకాష్ రెడ్డి వద్దకు గూండాలు బొట్టుశ్రీనును తెస్తారు. అచ్చు కింగ్‌లా ఉన్న బొట్టుశ్రీనును రాజవంశీయుల వారసుడైన కింగ్‌లా నటించమని ఒప్పిస్తారు. అలా ఊరువచ్చిన బొట్టుశ్రీనుకు కింగ్ తమ్ముడు దీపక్ విదేశాల నుంచి ఇంటికి వచ్చి మమతామోహన్‌దాస్‌ను పెండ్లి చేసుకుంటానని చెబుతాడు.
కానీ ఆమె దీపక్‌ను హత్యచేయాలని చూస్తుంటుంది. వీటిని కింగ్ గమనించి చంద్రముఖి తరహాలో అడ్డుకుంటాడు. కింగ్‌ను ఎందుకు చంపావని? మమతామోహన్‌దాస్‌ను నిలదీస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దీపక్ అసలు నిజం చెబుతాడు? అది ఏమిటి? అసలు కింగ్ చనిపోతే ఎలా బతికాడు? బొట్టుశ్రీను, శరత్ పాత్రల నేపథ్యమేమిటి? సంగీతదర్శకుడు జయసూర్య పగ చల్లారిందా? మేనమామయ్యలు ఏం చేశారు? మరి కింగ్ సరసన 8 మంది నాయికలు ఎందుకు కన్పిస్తారు? ఈ సమాధానాలకు సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ: నాగార్జున పెద్దగా కష్టపడినట్లు ఎక్కడా కనిపించదు. "హలోబ్రదర్స్"లో చేసినట్లుగా చాలా సునాయాసంగా మూడు పాత్రల్ని పోషించాడు. ఇక త్రిష పాత్రకూడా ఇదే తరహాలో ఉంటుంది. గెలిచేవాడు కాదు.. గెలిపించేవాడు కూడా కింగ్. అంటూ పలికే డైలాగ్‌లు ఒకసారికి వినడానికి బాగుంటాయి. శ్రీహరి రొటీన్‌గానే తెలంగాణ యాసలో ఉండే రౌడీ పాత్రను పోషించాడు. కాకపోతే అతనొక కళాకారుడిగా తనకొచ్చిన బొమ్మల ఆర్ట్‌తో కాస్త ప్రేక్షకులను నవ్విస్తాడు. మమతామోహన్‌దాస్ కొంత క్రూరత్వంతో కన్పిస్తుంది.
ఇక మిగిలిన నటీమణులు ప్రియమణి, అనుష్క, కామ్నాజెఠ్మలానీ, స్నేహఉల్లాల్, ఛార్మి, జెనీలియాలు కింగ్ పెండ్లి సందర్భంగా వచ్చిన అతిథులుగా ఓ పాటలో కన్పిస్తారు. నాగార్జున మన్మథుడు అనిపించుకోవడానికే ఈ సాంగ్‌లో వారు డ్యాన్స్ చేసినట్లుందే తప్ప కథకు ఏ మాత్రం సంబంధం లేదు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడి పాత్ర.. టీవీల్లో వచ్చే సంగీత పోటీలకు పారడీగా మలిచినట్లు ఉంటుంది.
ఇక మాస్టర్ భరత్.. శ్రీహరి బావమరిదిగా కాస్త నవ్విస్తాడు. రాయలసీమ యాసలో జయప్రకాష్‌రెడ్డి, కోస్తా యాసలో కృష్ణభగవాన్, షిండే తనశైలిలో డైలాగ్‌లు చెప్పి అలరిస్తారు. కథకులు కోన, గోపీమోహన్ పేర్లను మేనమామ పాత్రలకు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఎన్నో ట్విస్ట్‌లు కన్పిస్తాయి. కింగ్‌లా వచ్చే డమ్మీ పాత్ర బొట్టుశ్రీను బంగళాలో ఉన్నంతసేపు... చంద్రముఖి తరహాలో... కింగ్ తనను ఆవహించినట్లు చేస్తాడు. కానీ అది ప్రేక్షకుల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికే కానీ దానివల్ల ప్రయోజనం లేదు.
మేనమామలు చంపినట్లుగా చూపిస్తారు. కానీ వారు చంపరు. అదొక ట్విస్ట్. ఓపెనింగ్‌షాట్‌లో కన్పించే విలన్ కింగ్‌ను చంపినట్లుగా ఫోన్ సంభాషణలు చూపుతారు. కానీ అతడూ చంపడు. మమతామోహన్‌దాస్ చంపినట్లుగా చూపిస్తాడు. కానీ ఆమె కూడా చంపదు. వీరందరూ కాదని కింగ్‌ను తానే చంపానని కింగ్ సోదరుడు దీపక్ షాక్ ఇస్తాడు. ఇదంతా ఈర్ష్యకోసమేనని చెబుతాడు. ఇదికూడా పాతకాలపు స్టోరీలను తలపిస్తుంది.
కాకపోతే... దీపక్ తన అన్న కింగ్‌ను ఎలా చంపాడు అన్నది మాత్రం చూపించడు. ఇది చిత్రానికి మైనస్. పాజిటివ్‌గా చెప్పాలంటే... విలన్లుగా చూపిస్తున్న వ్యక్తులంతా పాజిటివ్‌గా మారడం, ప్రత్యర్థి వర్గీయుల మనుషులు కూడా కింగ్ ఆసరాగా నిలవడం ఈ చిత్రం ప్రత్యేకత. ఇక భారీ ఫైట్లు, ఛేజింగ్‌లు.. చిత్రాన్ని సాగదీయడం మినహా ఏమాత్రం విజయానికి ఉపయోగపడవు. మొత్తం మీద ఈ చిత్రం ప్రేక్షకుడిని కాస్త కన్‌ఫ్యూజ్‌కు గురిచేస్తుంది. దీన్ని ఏ మేరకు ప్రేక్షకులు ఆదరిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|